మరణం
కొందరు కన్నీళ్ళకు చైనా గోడ
కడుతుంటారు
కొందరు దేహాల్లోకి
శోకాన్ని ఆవాహన చేస్తుంటారు
కొందరు నిశ్శబ్ద యోగుల్లా
మౌన ముద్ర దాల్చుతారు
మరికొందరు అగ్ని పర్వతం
పగిలినపుడు వెదజల్లబడే
లావాలా దుఃఖాన్ని
నడుల్లా పారిస్తుంటారు
అకస్మాత్తుగా అక్కడ నిశ్శబ్దం పరుచుకొంటుంది
వచ్చిన చుట్టం
మళ్లీ అందరిలో విషాద వృక్షాన్ని
పెకిలిస్తుంది
దూరంగా కూర్చున్న కొన్ని పెదాలు
మంచి చెడుల్ని వర్గీకరిస్తుంటాయి
మరికొన్ని తలలు
ఆస్తుల్ని , అప్పుల్ని
చిట్టా పద్దులు రాస్తుంటాయి
పసిపిల్లలు జనన మరణ రహస్యాలు
చేదించిన వారిలా ఆటలాడుతుంటారు
కట్టిన చీర గురించో ,పంచె గురించో
కొత్త పద్యాలు పుడతాయి
వడ్డించిన పెద్ద చేయిపై
వ్యాఖ్యాన గ్రంథాలు ఆవిష్కరించాబడతాయి
మరణానిదీ ఒక సార్థకతే
మనసుల మధ్య మౌనం నెర్రె
విశ్వవ్యాప్తమైన వేళ
కాసింత సేపైనా
మనిషిని సమూహంలో చేర్చింది
విసిరేసుకున్న చేతులను
తిరిగి తన దేహంపై
మొలకెత్తించుకున్నది
ఇప్పుడు ఆ దేహం చుట్టూ
కొత్తకాంతి పరివేష్టితమై 